TV Serial Name
Amrutam Singers Kalyan Malik Music Director
Kalyan Malik Year Released 2006? Actors
Sivaji Raja, Sanjeevani
Gundu Hanumanta Rao,
& Jhansi Director Hari Charan Producer Gunnam Ganga raju
Context
Song Context: Its your attitude that matters! (ఎటో వెళ్ళిపోతూ నిను చూసింది అనుకోవొయ్ ట్రబులు)
Song Lyrics
||ప|| |అతడు|
అయ్యోలూ అమ్మోలూ ఇంతేనా బ్రతుకు హో హో హో
ఆహాలూ ఓహోలూ ఉంటాయి వెతుకు హా హా హా
మన చేతుల్లోనే లేదా రిమోట్ కంట్రోలు?
ఇట్టే మార్చేద్దాము ఏడుపుగొట్టు ప్రోగ్రాంలు!
వార్తల్లో హెడ్లైన్సా మనకొచ్చే చిలిపి కష్టాలు?
అయడిన్ తో అయిపోయే గాయాలే మనకు గండాలు
.
||చ|| |అతడు|
ఎటో వెళ్ళిపోతూ నిను చూసింది అనుకోవొయ్ ట్రబులు
“హలో హౌ డుయూ డూ” అని అంటోంది అంతే మీ లెవెలు
ఆతిథ్యం ఇస్తానంటే మాత్రం వస్తుందా
తీరిగ్గా నీతో కాలక్షేపం చేస్తుందా
గాలైనా రాదయ్యా నీదసలే ఇరుకు అద్దిల్లు
కాలైనా పెడుతుందా నీ ఇంట్లో పెను తుఫానసలు?
.
||చ|| |అతడు|
ఒరేయ్ ఆంజనేయ్లూ! తెగ ఆయస పడిపోకు చాలు
మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు
కరెంటూ రెంటూ ఎట్సెట్రా మన కష్టాలు
కర్రీలో కారం ఎక్కువ ఐతే కన్నీళ్ళు
నైటంతా దోమల్తో ఫైటింగే మనకి గ్లోబల్ వార్!
భారీగా ఫీలయ్యే టెన్షన్లేం పడకు గోలీ మార్!
.
.
(Contributed by Phanindra KSM)
Highlights
ఇప్పుడు కొంత విశ్లేషణ: .
సృష్టిలో objective అంటూ ఏదీ నిజానికి ఉండదు. పూలు అందంగా ఉన్నాయన్నది కరెక్ట్ కాదు. పూలు నీకు అందంగా అనిపించాయ్. ఇది కష్టం అన్నది కరెక్ట్ కాదు. నువ్వు దానికి కష్టం అని పేరు పెట్టుకున్నావ్ కాబట్టి, అదేదో పెద్ద ఇబ్బందైన విషయం అని అనుకున్నావ్ కాబట్టి అది నీకు కష్టం. ఇలా మన mind ఏది చూపిస్తే అది చూస్తాం మనం. అది చూపించిన జగాన్నే జగం అనుకుంటున్నం మనం. అందుకే “జగమే మాయ” అన్నది. ఈ mind ఒక cricket commentator లా ప్రతి దానికి ఏదో commentary చెబుతూ ఉంటుంది. మనం దానీ ద్వారా అన్నీ తెలుసుకుంటున్నాం. అసలు ఈ commentary ఏమీ లేకుండా cricket match ని (అంటే హర్షా భోగ్లే commentary లేకుండా, “ద్రావిడ్ జిడ్డు గాడు! ధోని కి బలం తప్ప స్టైల్ లేదు! లాటి మన మనసు చెప్పే commentary ఏది లేకుండా) చూడగలమా అన్నది philosophical ప్రశ్న.
. ఈ మనసు మాయని deal చెయ్యడానికి రకరకాల techniques ఉన్నాయ్. ఏమౌతుందో ఏంటో అని ఫలితం గురించి అతిగా తాపత్రయ పడే mind ని పక్కకి నెట్టి పని చేసుకుంటూ పోతే అది “కర్మ యోగం”. భక్తి భావంలో లీనమై ఆ భక్తి లో ఈ mind ని కరిగించేస్తే అది “భక్తి యోగం”. mind ని observe చేస్తూ, present moment లోనే ఉంటూ, ఈ mind వలలో పడకుండా ఉంటే అది “రాజ యోగం” (meditation). ఇవన్నీ కాకుండా, “ముల్లుని ముల్లుతోనే తియ్యాలి” అన్న నానుడి ప్రకారం, “ఓ మైండూ! నువ్వు కష్టం అన్న దాన్ని నీ చేతే ఇష్టం అనిపిస్తా. ఇప్పుడు బాధపడాలి అని నువ్వు అన్నప్పుడు, ఓసింతేగా ఏముంది అంతగా బాధ పడేందుకు అని అనిపిస్తా” అని mind ని mind తోనే ఢీకొడితే అది “జ్ఞాన యోగం” .
(Of course, ఇవన్నీ కొంత simplified definitions. మీలో యోగా experts ఎవరన్నా ఉంటే “నువ్వు చెప్పినదంతా తప్పుల తడక” అంటూ నా మీదకి యుద్ధానికి రాకండి. ఈ అజ్ఞానిని క్షమించేసి మీ ఔదార్యం చాటుకోండి )
. సిరివెన్నెల చాలా పాటల్లో ఈ “జ్ఞాన యోగం” అప్రోచ్ పాటిస్తారు. imagination అంటూ మనుషులమైన మనకి ఏడ్చింది కాబట్టి దానిని వాడి లేనిపోని ఊహల్నీ, భయాలని, బాధలని కల్పించుకుని మరీ ఏడవడం ఎందుకు? ఆ imagination తో మంచిని, శ్రేయస్సుని, positiveness ని, పురోగతినీ ఊహించుకోవచ్చు కదా? అన్న తత్త్వం సిరివెన్నెల గారిది - .
అయ్యోలూ అమ్మోలూ ఇంతేనా బ్రతుకు హో హో హో
ఆహాలూ ఓహోలూ ఉంటాయి వెతుకు హా హా హా
. “వెతికితే” తెలుస్తుంది అంటున్నారు. ఎక్కడ వెతకాలి? మన సంతోషాలని బయట ప్రపంచంలో వెతుక్కోడం ఒకటి. మనలో మనం వెతుక్కోడం ఇంకోటి. ఈ రెండోది బయట ప్రపంచంతో నిమ్మిత్తం లేకుండా, అన్ని కాలాల్లోనూ మనల్ని ఆనందంలో ఉంచగలుగుతుంది. .
మన చేతుల్లోనే లేదా రిమోట్ కంట్రోలు?
ఇట్టే మార్చేద్దాము ఏడుపుగొట్టు ప్రోగ్రాంలు!
. చాలా మంది అసలు బాధ రాకుడదు అనుకుంటారు. అప్పుడే ఆనందంగా ఉండగలం అనుకుంటారు. ఒకవేళ వచ్చిందంటే కొన్ని గంటలో, రోజులో, నెలలో బాధ పడాల్సిందే అని మనకి లెక్కలు ఉంటాయ్ - .
e.g ఓ అసమర్థుని జీవ యాత్ర
బాధ – బాధపడే కాలం
ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే – ఒక గంట
పక్క వాడు బాగుపడిపోతుంటే – ఒక రోజు
ఆఫీసులో హైకు రాకపోతే – ఒక వారం
ప్రేమ విఫలమైతే – ఒక జీవితం
.
Note: ఒకే బాధకి బాధపడే కాలం మనిషిని బట్టి మారును
. maths లో వీక్ అయిన వాళ్ళు కూడా ఈ లెక్కలు తప్పకుండా, తెలియకుండానే కట్టి ఖచ్చితంగా బాధపడిపోతూ ఉంటారు. కొంచెం upset అయ్యి మూడ్ బాలేకపోతే sad face పెట్టాలి కాబోలు అనుకుని మరీ పెడుతుంటారు. డబ్బులు కట్టి చూస్తున్న సినిమానే బాగులేకపోతే బయటకి వచ్చేస్తాం, కానీ మనకి తెలియకుండానే మనలో ఎన్నో కలతల సినిమాలని entertain చేస్తున్నాం. ఎన్నో చానెల్సు ఉన్నా, రిమోట్ ఉన్నా, పాత “దూరదర్శన్” రోజుల్లో లాగ “చిత్రలహరి” చూస్తూ బ్రతుకుని చిత్రంగా గడిపెయ్యడం ఏమిటి? .
వార్తల్లో హెడ్లైన్సా మనకొచ్చే చిలిపి కష్టాలు?
అయడిన్ తో అయిపోయే గాయాలే మనకు గండాలు
. మనకి ఇంకో జబ్బు ఉంది – చిన్న విషయాలని పెద్దవి చేసుకోవడం. ఇప్పుడు పెద్దైపోయాం, చిన్ననాటి బంగారు బాల్యం తిరిగి రాదేమి అని డైలాగులు కొడతాం గానీ, ఇలా తిరిగి రాని వాటిగురించి కాకుండా తరచి చూస్తే తరిగి పోయే కల్పిత కష్టాల గురించి అసలు ఆలోచించం. .
ఎటో వెళ్ళిపోతూ నిను చూసింది అనుకోవొయ్ ట్రబులు
“హలో హౌ డుయూ డూ” అని అంటోంది అంతే మీ లెవెలు
ఆతిథ్యం ఇస్తానంటే మాత్రం వస్తుందా
తీరిగ్గా నీతో కాలక్షేపం చేస్తుందా
గాలైనా రాదయ్యా నీదసలే ఇరుకు అద్దిల్లు
కాలైనా పెడుతుందా నీ ఇంట్లో పెను తుఫానసలు?
. అసలు కష్టానికి చాలా మంది fans ఉన్నారు. పాపం అందరినీ అంతో ఇంతో పలకరిస్తూ పోతూ ఉంటుంది. అంతే గానీ ఉండమన్నా నీతోనే ఉండిపోదు. అయినా కష్టాన్ని “వలచి మరీ వగచేను” అని అనుకుంటే నీ ఇష్టం! కాబట్టి విశాల హృదయులమై వచ్చిన ప్రతి కష్టాన్ని శరణార్థిగా భావించి ఆశ్రయమివ్వకుండా, కఠినంగా వ్యవహరించడం అవసరమని సిరివెన్నెల ఎంతో తమాషాగా సూచించారు ఇక్కడ. .
ఒరేయ్ ఆంజనేయ్లూ! తెగ ఆయస పడిపోకు చాలు
మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు
కరెంటూ రెంటూ ఎట్సెట్రా మన కష్టాలు
కర్రీలో కారం ఎక్కువ ఐతే కన్నీళ్ళు
నైటంతా దోమల్తో ఫైటింగే మనకి గ్లోబల్ వార్!
భారీగా ఫీలయ్యే టెన్షన్లేం పడకు గోలీ మార్!
. ఇప్పటి వరకు చెప్తున్న భావాలనే మళ్ళీ ఇంకో సారి ఇంకోలా చెప్తున్నారు ఇక్కడ. “చెంచాడు భవసాగరాలు” అన్న ప్రయోగం అద్భుతం. కష్టంలో మునిగి ఉన్నంత కాలం అదో సాగరం అనిపిస్తుంది. బయటకి ఈది వచ్చి చూస్తే ఇంతేనా అనిపిస్తుంది. ఈ అనిపించడం జరగాలంటే ముందు మనం “అనుకోవడం” చెయ్యాలి. ఇదంత సులభం కాదు. సాధన చెయ్యాలి. ఎంత చేసిన కొన్ని సార్లు demotivate అవ్వడం సహజం. అప్పుడు ఇలాటి ఓ సిరివెన్నెల పాట వింటే సరి. .
People often say that motivation doesn’t last. Well, neither does bathing. That’s why we recommend it daily.” — Zig Ziglar
. వ్యాసం ముగించే ముందు చిన్న వివరణ. ప్రతి విషయాన్ని “లైట్ తీసుకో” అనే చెప్పడమే కదా ఇది అని కొందరు ఈ సందేశాన్ని అపార్థం చేసుకుని ఏమీ చెయ్యకుండా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇది లైట్ తీసుకోవడమే, కానీ సీరియస్ గా లైట్ తీసుకోడం!! .
.
(Analysis by Phanindra KSM)
(Originally posted @ http://manikya.wordpress.com)
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world