Highlights
ఇప్పుడు కొంత విశ్లేషణ:
.
నిండు చందమామను ఆరుబయట నించుని చూసినా, అరుగు మీంచి చూసినా మనవైపే చూస్తున్నాడా అని అనిపించడం సహజం, అలాగే సిరివెన్నెలను పోలిన మహనీయుల కవిత్వం ప్రతీ వారికీ మనకొరకే వ్రాశారా అని అనిపించటం సహజం. అలా అనిపించే గీతాల కోవకు చెందిన ఈ పాట, ఒక చక్కటి సందేశ ముత్యాల మూట. ఆయన ఎటువంటి భావంతో వ్రాశారో తెలియదు కానీ, నాకు ఇలా అనిపించింది.
.
నగరంలో ఈ పూట, వినిపించే నా పాట..
నట్టడవి తల్లి ఒడిలో.. పుట్టింది పసిడికలతో..
ఎన్నెన్ని ఆశలను తెచ్చిందీ.. తనతో..
అట్టడుగు మట్టి బడిలో..మొదలైంది చదువు మీతో
చేయూత నిచ్చి నడిపించండీ దయతో..
మొక్కై మిగిలిపోకుమందీ.. దిక్కులు దాటి ఎగరమంది
రెక్కలు కట్టి అడవి నన్నే.. పంపిందీ..
ఎంతో పెద్ద లోకముందీ,. ఏదో విద్య నేర్పుతుందీ
ఎన్నో అనుభవాలు పొందీ.. రమ్మందీ..
.
అంటే మనిషి తన భావాలను ఓ మాట రూపంలో లేదా ఓ పాట రూపంలో వ్యక్తపరచగలగటం, అలాగే నేడు అతనికి తెలిసిన అనంతమైన విఙ్ఞానం, అలవరచుకున్న నాగరికత అన్నీ ఎన్నో వేల ఏళ్ళ మానవుని నిరంతర కృషి ఫలితం. ఏ భాషా, లిపి లేక అడవిలో ఆవిర్భవించిన ఆదిమమానవుడు ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడీ స్థాయికి చేరుకున్నాడు. ఎంతో విఙ్ఞానమును స్వంతం చేసుకుని తనని పుట్టించిన ప్రకృతిమీదే ఆధీనత చూప గలుగుతున్నాడు. ఎక్కడో ఓ చిన్న పాఠశాలలో మొదలైన విఙ్ఞామునకు నేర్చిన అనుభవాలను జోడించి నలుగురికీ పంచవలసిన బాధ్యత ఉందని ప్రతి విద్యా వంతుడూ గుర్తించాలి.
.
పాల నవ్వుల పసితనం వదిలేసి ఎదిగిన యవ్వనం
పల్లేరు ముళ్ళను పరిచిన బాటవదా..
జాలి తెలియని భుజబలం, చేలన్ని ముంచే నదిజలం
కన్నీటి జల్లులు కురిసిన వానవదా..
మనసును పెంచలేని ఙ్ఞానం, మనిషిగ ఉంచలేని ప్రాణం
బ్రతుకును నడపలేని పయనం.. అయిపోదా..
.
అత్యాశకు లోనై, అడ్డదారులలో గడించే ధనము, ఖ్యాతి సంతృప్తిని ఇవ్వవు. ఓ దేశమైనా, ఓ వ్యక్తి అయినా బలమున్నదికదా అని విచక్షణారహితంగా ప్రవర్తిస్తే నష్టాలు, కన్నీళ్ళు తప్పవు.
.
ఆది కవి గా నిలిచిన, ఆ బోయవాడిని మలచిన
విద్యాలయం ఓ కారడవే కాదా..
సేతువును నిర్మించిన, ఆ కోతి జాతికి తెలిసిన
విఙ్ఞానమంతా నగరం నేర్పిందా..
మెదడుకు చెదలు పట్టకుంటే, హృదయం అద్దమల్లే ఉంటే
చాలని తెలుసుకున్న తెలివే చదువంటే…
.
కేవలం నగరాల్లోనూ, విశ్వవిద్యాలయాలలోనూ, పుస్తకాలు చదివి నేర్చిన శాస్త్రాలూ, పొందిన డిగ్రీలు మాత్రమే చదువులు కావు. అనవసరమయిన పంతాలకు పోక, ద్వేషాహంకారములను విడనాడి, స్వచ్చమయిన మనసుతో తెలిసిన తప్పును సరిదిద్దుకొనే వివేకమును మించిన విద్య ఏదీ లేదు
.
.
Analysis by Dr. Jayasankar
………………………………………………………………………………………………… |