తానా2009: సాంకేతిక వికాసం - సాంస్కృతిక విన్యాసం

Posted by admin on 10th July 2009 in ప్రవాసాంధ్రుల గమ్యం

  

Audio Song Part-1:
 
Audio Song Part-2:
 
Sirivennela Keynote Part-1:
 
Sirivennela Keynote Part-2:
 
Sirivennela Keynote Part-3:
 
Programme Name
   17th TANA Conference (2009),
   Chicago, Inaugural Dance Ballet

Singers
   B.A. Narayana, Taarak,
   Santosh, Pavan,
   Pranavi & Deepti Madhuri

Music Director
   Taarak
Year Released
   July 3, 2009
Actors
   150 Artists from Chicago
Music Coordinator
   Bhamidipati 
   Srinivasa Rao

Producer
   Dr. V. Chowdary Jampala on
   behalf of 17th TANA
   Conference

Choreographers
   Jyotsna Kilani,
   Sushmitha Kumar,
   Sobha Thammana,
   Vanitha Veeravalli, &
   Hema Yaddanapudi

Ballet Production
   Usha Pariti with help from  
   Jagadish Kanuru,
   Bhaskar Reddy Karri,
   Saroja Ravi, &
   Ramaraja Yalavarti

Context

ప్రవాసము + ప్రపంచీకరణ => అభినవ మానవపురోగమ గాధ

Dance Ballet Lyrics

(చీకటి వేదిక. వేణునాదం నెమ్మదిగా మొదలై, అలలు అలలుగా తిరుగుతూ, స్థాయి పెరుగుతూ, తీవ్ర స్థాయికి వెళ్ళి ఒక్కసారిగా ఆగిపోతుంది. ఆ నిశ్శబ్దంలో ఒక్క గొంతుకతో ఓంకారంతో మొదలైన శాంతిసూక్త పఠనం నెమ్మదిగా అనేక గొంతులను చేర్చుకొంటూండగా నెమ్మదిగా వేదిక కాంతివంతమౌతుంది)
.
1.
       ఓం ద్యౌ శ్శాంతిః పృధివిశ్శాంతిః
       అంతరిక్షశ్శాంతిః ఆపశ్శాంతిః
       కామశ్శాంతిః క్రోధశ్శాంతిః
       సర్వశ్శాంతిః
       శాంతిదేవశ్శాంతిః
.
(శంఖారావం వినిపిస్తూంటుంది)
.
2. (సూత్రధారి, నటి, పారిపార్శ్వికుడు ప్రవేశం)
(సూత్రధారి — నాందీ ప్రస్తావన)
       శాంతిని సంకల్పించే శంఖారావం
       స్వాంతమ్ముల పాలించే సుహృద్భావం
       చాటిస్తున్నది తానా
       చాటిస్తున్నది తానా తన మనోరథం
       సాధిస్తానంటున్నది సర్వజనహితం
       అధునాతన సాంకేతిక వికాసమే తేరుగా
       సనాతన సంస్కృతిక విన్యాసమే దారిగా
       భువన విజయమందగా
       ఉద్యమించు ముందుగా
       ప్రస్తావిస్తున్నది తన ఆశయాన్ని నాందిగా
       అస్తు! శుభమస్తు! అవిఘ్నమస్తు! అంటూ తథాస్తు పలుకమంటూ
.
3. (సూత్రధారి, నటి, పారిపార్శ్వికుడు బృందగానం)
       అందిస్తున్నాం అగజాసుతునికి ఆద్యభివందనం
       ఓం శ్రీ గణేశాయ నమః
       అర్థిస్తున్నాం అభీష్ట సిద్ధికి అఖిలదేవతాశాసనం
       ఓం సర్వేభ్యో దేవోభ్యో నమః
.
       తద్ధిమి తకధిమి జతుల నతులివే
       నిరతనాట్యరత సాంబశివా!
       సుమధుర స్వర సంగతుల వినతులివే
       శ్రితచరణా శ్రీ రమాధవా!
.
       భావ రాగ తాళాంచిత మంగళ భవతరంగమా, నమోస్తుతే!
       మృదుల పద కలిత కదన కుతూహల రసతరంగమా, జయోస్తుతే!
       రసతరంగమా, జయోస్తుతే!
       రసతరంగమా, జయోస్తుతే!
.
5. (సూత్రధారి)
(సహృదయులైన సభాసదులను సాదరంగా స్వాగతించ రమ్మని… ఈ కొమ్మని…)
(నటి పాట ప్రారంభించగా, సూత్రాధారి నిష్క్రమణ)
.
6. (నటి)
       రండి రండి రండి! దయ చేయండీ! విజ్ఞులారా విచ్చేయండీ!
       మా కైమోడ్పులందుకోండీ! కళాభిజ్ఞులారా రండి!
       కనబోయే కథనంలో వినబోయే వైనంలో
       వైచిత్రిని అవధరించి మా వెన్ను తట్ట రండీ!
                                            ||రండి||
.
||చరణం||
       నాట్యం అంటే శివార్చన!
       సంగీతం అంటే సంకీర్తన
       లాలి పాట నుంచి ఆఖరి వీడుకోలు దాకా
       ఓనమాలతో మొదలై పరమపదం దాకా
       ఆటా పాటా మాటా ఏవైనా
       మేనిమరుపుకై కాదనీ
       మేలుకొలుపు కోసమనీ
       ఉగ్గుపాలతో పొందిన మన ఔన్నత్యం కనిపించేలా
       సద్గుణాలతో పెంపొందిన మన సంస్కారం చూపించేలా
       మేలుగా, మెచ్చ వీలుగా, రూపొందించిన
       ఈ మా చిత్రకల్పనను చూసి ఆదరించ రండీ
       రండి రండి రండి రండి
       రండి రండి రండీ! దయ చేయండీ! విజ్ఞులారా రండి!
.
7. (విదూషకుడు)
       అబ్బబ్బబ్బబ్బో ఏవద్భుతమనుకోమా
       ఎన్నడు ఎరగని అబ్బురమంటూ తబ్బిబ్బైపోమా
.
       చోటూ, డేటూ వేరే గానీ,
       తేడా అంటూ ఏమీ లేని
       అదే తతంగం, అంతకు మించి ఏదో ఉందనుకొంటామా
                                   || అబ్బబ్బబ్బబ్బో||
.
||చరణం||
       ఎందర్నో ఇక్కడినుంచి, ఇంకొందరి నాంధ్రానుంచి
       వందలమందిని సమీకరించి, సమాదరించి, సమ్మానించి,
       విందులు, చిందులు, చందనచర్చలు
       జరిపే ఈ సందడి మాకేం కొత్తా?
       కానీండి మామూలేగా అంతా
.
8. (నటి)
       సప్తసముద్రాలు దాటి ఎంతదూరమొచ్చినా
       అంత సులువుగా వదలదు సొంత మట్టి వాసన
       ఇంటి మీద గాలి మళ్ళి చింత ముంచుకొచ్చెనా
       కొంతైనా తగ్గించద ఇలాంటి సమ్మేళన!
.
||చరణం||
       ఎవరికి వారై గడపాలా ఎన్నాళ్ళైనా ఏకాంతాన
       అయిన వాళ్ళంత కలుసుకునే వీల్లేదా అపుడపుడైనా
       అనుకుని, ముప్పది ఏళ్ళకు మునుపే ముందడుగేసిన తానా
       అప్పటి నుండీ అవిరామంగా అలరిస్తున్నది శ్రమ ఎంతైనా
.
9. (విదూషకుడు)
       కనకే మీ వెనకున్నామని హామీ ఇస్తున్నాం
       మీరేం చేస్తున్నా హర్షిస్తున్నాం ఆమోదిస్తున్నాం
                             || అబ్బబ్బబ్బబ్బో ||
.
[అంతమాత్రాన...]
.
       ఎందుకులెండి ముందరికాళ్ళకు బంధాలేస్తారు
       ముందరనుండీ తేడాగానే ఉన్నది మీ తీరు
       శంఖారావం అంటారు అది శాంతిసంకేతమంటారు
       సంగ్రామానికి సత్సంగానికి ఎందుకు లింకెడుతున్నారు?
                              ||అబ్బబ్బబ్బబ్బో||
.
10 (పారిపార్శ్వికుడు, నటి)
       లక్ష యక్ష ప్రశ్నల కుక్షివె అయినా కుశాగ్రబుద్ధివె కూనా
       సూక్ష్మాన్నిట్టే గ్రహించబట్టే గుచ్చి అడిగావు కన్నా!
.
       వలస పిట్టలై ఆకలి రెక్కలు కట్టుకు వచ్చామా?
       పట్టెడు మెతుకులు పుట్టక పొట్టను పట్టుకు వచ్చామా?
       కిరాయి కిట్టే పని చూపెట్టే పరాయి పంచను చేరాక
       పొరుగువాళ్లతో మనలేక
       మనకి మనం ప్రత్యేకంగా
       ఓ గుంపు కూర్చుకుని సరదాగా
       సంబరపడుతూ ఉన్నామా?
.
       ఇలాటి ప్రశ్నల కిదీ జవాబని అడక్కముందే అనలేమా
       ఇదీ ప్రయోజనమనే వివేచన వివరిస్తున్నా విను వేమా
.
       ఈ చోటికీ ఈ పూటకీ ఉన్న ప్రాశస్త్యం నీకు తెలుసునా?
       ఆ విశిష్టతే కదిలించిందీ మాలో నూతన యోచన
       అవసరాన్ని గుర్తించమని,
       ఔచిత్యం పాటించమని,
       ఆ ప్రయోజనం నెరవేరే ఇతివృత్తాన్ని ఎంచుకుని
       సంతోషంతో బాటుగా సందేశాన్ని ఇమ్మని సూచన
       అందిస్తూ ఆదేశిస్తూ మా మదిలో నింపిన ప్రేరణ
       ఎవరిదో చూడు నాయనా ||2||
.
11. (అచ్చ తెనుగు ఆహార్యంతో చికాగో నగరం ప్రవేశం; ఆమెను చూస్తూ విదూషకుడు నటితో గుసగుసగా)
       వీరీ వీరీ గుమ్మాడీ! వీరీ పేరేమి అమ్మాడీ
       తెలుగింటి ఆడబడుచులా ఎంత ముస్తాబైనా గాని
       తెలిసిపోతూనే ఉన్నది ఈమె పాశ్చాత్య దొరసాని
       వీరీ వీరీ గుమ్మాడీ! వీరీ వీరీ… వీరి పేరేమీ
.
12. (చికాగో నగరం)
.
       నన్ను పోల్చలేదా నేనే చికాగో పురాన్ని
       అన్ని రంగాలలో అమెరికా గోపురాన్ని
       ఎన్నో వైవిధ్యాల ఎన్నెన్నో విభిన్న జాతుల
       జనులెందరికో సొంత నికేతాన్ని,
       సమైక్యతకు సంకేతాన్ని
                     ||నన్ను పోల్చలేదా||
.
       అన్ని లక్షణాలా పశ్చిమాన ఉన్న భారత తేజాన్ని
       జాతిమతాలను వివక్ష లేని విలక్షణ నైజాన్ని
       శ్వేతసౌధానికి బరాక్ ఒబామాని పంపిన స్వేచ్ఛకు సాక్ష్యాన్ని
                     ||నన్ను పోల్చలేదా||
.
(అంటూ అందరికేసి తిరిగి)
[ఎప్పుడో 1981లోనూ, 1995లోనూ కలిశాం కదా! మళ్ళీ ఇప్పుడు....]
.
13. (చికాగో నగరం)
       ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కెన్నాళ్ళకు! కళ్ళారా చూశాను ఇన్నేళ్ళకు!!
       క్షేమమే కదా అందరూ! ఎంతో ఎదిగిపోయుంటారు పిల్లలు!
       ప్రత్యక్షంగా చూడలేకున్నా, అన్ని విశేషాలూ వింటూనే ఉన్నా
.
       ఎంత త్వరగా విస్తరించినా సమాచార పరిజ్ఞానం
       అంత తరచుగా కలుసుకొనేటంత సమయం లేదంటున్నాం
       అంతరిక్షమే అందుబాటుకొచ్చి అంతరిస్తున్నా దూరం
       ఎందుచేతనో చెంతనె ఉన్నా చేరువకాలేని తనం
.
       సెల్‌ఫోనుందిగా చాలు ఎందుకు ముఖాముఖీ మంతనాలు
       ఈమెయిలు పంపేవాళ్ళు శ్రమపడి రాయాలా ఉత్తరాలు
       ఛాటింగుండగా మీటింగెందుకు
       డేటాబేసుండగా డౌటింకెందుకు
.
       ఇన్ని సౌకర్యాల టెక్నాలజీ చూసి,
       ఆహా అని మక్కువ పడిపోవాలో
       ఔరౌరా అని ముక్కున వేలెయ్యాలో || ఎన్నాళ్ళ ||
.
14. (పారిపార్శ్వికుడు)
(అవును తల్లీ! ఎల్లలన్నీ చెరిపిన ఈనాటి గ్లోబలైజేషన్ ఇంత అల్లకల్లోలంగా ఎందుకుందా
అనే చర్చని, వినోద కార్యక్రమంలో చొప్పించడం సబబా కాదా అని సతమతమవుతున్నాం)
.
15. విదూషకుడు
       సంతోషంగా సరదాగా సాగే పండుగలో
       సందేహాలూ సందేశాలూ ఎందుకు ఇందరిలో?
       వేదిక ఇచ్చావనుకో! అందుకు సదా కృతజ్ఞులమనుకో!
       అడగని సలహాలిస్తూ చేస్తావా ఉపదేశం?
       తెలుగు సంప్రదాయం తెలియని నువు మా పరదేశం!
       మన్నించమ్మా! నిందించాలని కాదు సుమా నా ఉద్దేశం!
.
16. (చికాగో నగరం)
       ఎంత మాటన్నావు నాయనా!
       నేను, మీకు అంత కాని దానినా?
.
       రక్తసంబంధం లేదనా మీ
       సొంతమట్టి ఇది కాదనా?
       పేగు తెంచుకుని పుట్టుక నిచ్చిన కన్నతల్లి తెలుగునాడైనా
       పేరు తెచ్చుకుని వర్ధిల్లండని పెంచుకున్న తల్లి నే కానా
       కన్నది దేవకి అయినా కన్నయ్య నొళ్ళోకి చేర్చుకున్న
       యశోదతీరున అక్కున పొదువుకున్న అమ్మను కానా
       అమ్మకున్న హక్కు ఉందనుకున్నా
       అందుకే వచ్చి కల్పించుకున్నా
.
||చరణం 1||
       విశ్వగురువుగా విఖ్యాతి పొందిన వేదభూమికి చెందినవారని
       విశ్వామిత్రుని సంతతివారని విశ్వానికి సన్మిత్రులు మీరని
       సృష్టికే ప్రతిసృష్టి చేయగల నైపుణ్యం మీకున్నదని
       తరతరాల మీ పూర్వుల పుణ్యం మీ వెనకున్నదని
       ఏరికోరి స్వాగతించాను
       మిమ్ము దత్తత స్వీకరించాను
                                || ఎంత మాటన్నావు ||
.
||చరణం 2||
       జలపాతాలపైన, జలధి తరంగాలపైన
       ఉయ్యాల జంపాలలూగే ఉత్సాహాన
       ఉరకలిడే చైతన్యం తరగని తానా
       పయనిస్తూనే ఉన్నది విజయపథాన!
       అభ్యుదయం అభిమతమై, జనహితమే తన మతమై
       అందరి ఆనందం తనదని తలచే సద్భావన, సదాచరణ
       గమనిస్తున్నా, గర్విస్తున్నా!
       T A N A అన్నది ఆంగ్లమెలా పలికినా
       అచ్చతెలుగు తర్జుమా తన అనమంటున్నా
       ఆ ముచ్చటే చెప్పాలనునుకున్నా
       మీ ఆనందానికి నే ఆటంకాన్నా
.
17. (విదూషకుడు)
       ఎంతటి చల్లని మనసమ్మా చికాగో నగరమా!
       మాకెంతటి విలువిచ్చావమ్మా అమెరికా దేశమా!
       మాపై అంతటి నమ్మకమా!
.
       నీలో ఏదొ అలజడి ఉన్నది పైకి తెలుపవమ్మా
       నీ ఆరాటం తీరాలంటే ఏం చేయాలమ్మా
       అది మేము చేయగలమా!
.
18. (చికాగో)
       మీకన్నా యోగ్యులెవరు ఆంధ్రులారా! మానవేంద్రులారా!
       వందనీయ వసుధ కన్న ఆర్యులారా! జ్ఞాన సూర్యులారా
       నిత్యాన్వేషణకైనా, విజ్ఞానార్జనకైనా
       ఆద్యులారా! అనితరసాధ్యులారా
.
||చరణం 1||
       జన్మసిద్ధమైన మీ శక్తి తెలుసుకోండి
       ధర్మబద్ధమైన మీ బుద్ధి మరువకండి
       భవితకు సువిధని కూర్చే శుభకామనతో
       ప్రగతికి సుగతిని చూపే కార్యదీక్షతో
       పశ్చిమాన ఉదయించిన ప్రభాతమనిపించే
       మీ ఆదిత్యహృదయ కాంతి ప్రసరింపజేయండి
       వర్తమాన నర సమాజ రథ సారథులనిపించే
       మీ ప్రజ్ఞాపాటవాల పాంచజన్య మూదండి.
.
19. (బృందగానం)
      ఆంధ్ర జాతి వికాసగీతిక నాలపించెద మందరం
      సాంద్రచంద్రికలీను సంస్కృతి నిలను పెంచెద మందరం
      భారతాంబకు తగిన సంతతి తెలుగువా రనిపించుదాం
       తరతరాల తపః ఫలమ్మును నవతరానికి పంచుదాం
.
20 (విదూషకుడు)
       ఇక్కడే పుట్టి ఇక్కడే ఉండబొతున్నది మన సంతానం
       ఈ భాషా, ఈ దేశమె వారికి ఎన్నటికైనా స్వస్థానం
       వారి తలలపై మోపుతార మన తాతల గాథల పెనుభారం
       ఈ దేశానికి తగిన పౌరులుగ పెరగాలిగ మన భావితరం!
.
21. (సూత్రధారి మళ్ళీ వచ్చి)
       భారతీయతన్నది ఒకదేశం కాదుర కన్నా,
       ఎల్లలతో గుర్తించే ప్రదేశమేం కాదు నాయనా!
       నిఖిల జగాళికీ, అఖిల జనాళికీ, సొంతమైన ఒక తాత్విక చింతన
       వసుధైక కుటుంబమని ఆ పావన భావన
.
||చరణం||
       సనాతనం ఆ సంస్కృతి, ప్రతి
       సమాజానికది జాగృతి
       ప్రగతికి అది పరమావధి,
       ప్రతి ఒక్కరిదా పెన్నిధి
       దేశమేది అయినా, వాసమెక్కడైనా, వేషభాషలేవైనా
       మనిషి అన్న చిరునామా మారదు ఏ నాడైనా
       ఖండాలుగా చీలినా నడుమ సంద్రాలే చేరినా
       ప్రపంచానికా సంపద చేర్చాలి
       మనమే ఆ బాధ్యత నెరవేర్చాలి
.
22 (చికాగోతో మొదలై, అందరూ కలిసిన బృందగానం)
       ఎవ్వరం మనం? ఎటు మన పయనం?
       నిరంతరం మన మదిలో జరగాలీ అంతర్మధనం!
                                     || ఎవ్వరం ||
.
||చరణం 1||
       సాటి ప్రాణికోటికన్న మనది మేటి జీవనం
       మనకే గల ఆ ఎరుకకి చూపామా నిదర్శనం
.
       ఆటవికతనుంచీ అత్యాధునికత వరకూ
       శతాబ్దులుగ సాగుతున్న మన ప్రస్థానం
       సవ్య దిశా గమనమో, శాఖాచంక్రమణమో
       ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేము ఏ క్షణం
                               ||ఎవ్వరం మనం||
.
||చరణం 2||
       పుడమిని పట్టి, కడలిని నెట్టే
       దర్పానికి దర్పణమా మన విద్యావిలసనం?
       అవని నుద్ధరించగా, అవతరించు మూర్తిగా
       దైవలక్షణం పెంచద మన విజ్ఞానం
.
       రెండే రెండడుగులేసి, భూనభన్మ్ములాక్రమించి
       అవధులన్నీ దాటుతున్న వైజ్ఞానిక విక్రమం
       మూడో అడుగును ముందుకు ఎటు వెయ్యాలో తోచక
       తన తలపై, తలపులపై మోపుకున్నదా
       తనను తాను అధోగతికి అణచుకున్నదా
       అడగమా మనం?
                                  ||ఎవ్వరం మనం||
.
23. (యువత, బృందగానం)
       తారలనే తెంచగలం తలచుకుంటే మనం
       ఆ దివినే దించగలం తెలివితో తక్షణం
       రాముడిగా ఎదగగలం రాక్షసులను మించగలం
       రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎపుడో సొంతముఖం
       రవికిరణం చీల్చగలం రంగులుగా మార్చగలం
       మన మనేకమైనా మమేకమై మనగలదా మనిషితనం!
.
24 (సూత్రధారుడు)
(ఈ వాస్తవాన్ని వివరిస్తే విననంటుందా యువత
వింటే, మేలుకుంటే, ఈ నవీన నాగరికతని నిర్వచించాలనుకుంటుంటే వాళ్ళ పరిభాషలోనే విను)
.
25. (యువత, బృందగానం)
       ట్వెంటీఫస్ట్ సెంచరీకి జై! ఇంటర్నెట్ వెంట వెళ్లరోయ్!
       కంప్యూటర్ కంపెనీగ ఉందోయ్!
       పాతాళం బూటయిందిరోయ్! ఆకాశం హేటయిందిరోయ్!
       భూగోళం బుల్లి బంతయిందోయ్!
       పోతన్నకి ఈ సంగతి ఏనాడో తెలుసులేవోయ్
       మానవుడిలో త్రైవిక్రమం చూసింది మనోడేనోయ్!
.
||చరణం 1||
       ప్రతిపూట సరికొత్త పొరాటమే
       ప్రతీ చోట పులినోట చెలగాటమే
       నిదరైన మరునాటి శ్రమ కోసమే
       శ్రమే హాయి అనుకుంటే సంతోషమే
       ఆదర్శమే రాదారిగా ఆకాశమందుకుంటాం
       సావాసమే సందేశమై అందర్ని అల్లుకుంటాం…
.
26. (సూత్రధారి)
(విన్నవుగా! సక్రమమైన సారధ్యం ఉంటే, ఎలాంటి సమరంలోనైనా విజయం సుసాధ్యం
సనాతన సంస్కృతి దిశానిర్దేశం చేస్తే అధునాతన విజ్ఞానంతో లోకక్షేమం తథ్యం.)
.
26. (చికాగో)
       ఒకనాడీ చికాగోలో వివేకానందవాణి
       ప్రపంచమంతా ప్రతిధ్వనించగ ప్రకటించిందీ సత్యాన్ని
       అదిగో … అదిగో…. అంతా ఆలకించండి
       నేటికీ ఆ ఉపనిషత్తు నీ గాలి ఆలపిస్తోంది
.
27. (వివేకానందుడు, నేపధ్యంలో))
       ఉత్తిష్టత! జాగ్రత! ప్రాప్యవరాన్నిబోధత!!
       క్షురస్య ధారా నిశితా దురత్యయా
       దుర్గం పథస్తత్కవయో వదంతి!!
.
28. (సూత్రధారుడు)
       పాదం మోపే వీలు లేని పదునైన కత్తి మీద నడక - నీ గమనం
       లే! మేలుకో! ఆందుకుంటే చూపుతుంది జ్ఞానుల చేయూత - నీ గమ్యం!
.
29. (చికాగో, సూత్రధారుడు)
       ఇక్కడున్న చక్కనైన సంఘజీవనం
       అక్కడ నువ్వందుకున్న ధర్మచింతనం
.
       రెండిటింకీ సమన్వయం సాధించే ధ్యేయం
       నిర్మించద భవ్యమైన నవ్య సమాజం
.
30. (పతాక సన్నివేశం, బృందగానం, ఒక్కరొక్కరుగా నర్తకులందరూ వేదికపై ప్రవేశిస్తుంటారు)
       లోకస్సమస్తా స్సుఖినోభవంతు ఆ వేదం మా ఎదనాదం
        ఆ మాట కర్థం ఇదిగో ఇదంటూ చూపాలి మన జీవితం
.
||చరణం 1||
       స్వప్నాలను పిలిచే చేతులివి
       సత్యాలుగ మలిచే చేతలివి
       నిట్టూరుపు తెలియని ఆశలివి
       కన్నీళ్ళను తుడిచే చెలిమౌతాం
       కష్టాలను గెలిచే బలమౌతాం
       కలకాలం నిలిచే కథలౌతాం
       మన రేపటి కోసం
.
||చరణం 2||
       మా వాదం గీతకి అనువాదం
       మా క్రోధం శాంతికి అభివాదం
       మా స్వేదం స్వేఛ్ఛకి అభిషేకం
       మా నాదం నవతకి చైత్ర స్వరం
       మా పాదం భవితకి భాను రథం
       మా పయనం ప్రగతికి భవ్యపథం
       తొలి అడుగెయ్ నేస్తం!
.
       సహనా వవతు
       సహ నౌ భునక్తు
       సహ వీర్యం కరవావహై
       తేజస్వి నావ ధీత మస్తు
       మా విద్విషా వహై
       ఓం శాంతిః శాంతిః శాంతిః!
       అసతోమా సద్గమయ
       తమసోమా జ్యోతిర్గమయ
       అమృతాంగమయ
       ఓం శాంతిః శాంతిః శాంతిః!
(నేపథ్యంలో వేద మంత్రం మంద్రంగా వినిపిస్తూండగానే, గానం)
.
       అభినవ మానవగాధకు మనమే వ్యాసులమౌదాం
       విభేదాలకు, వివాదాలకు భరతవాక్యమౌదాం!
.                            
(తెర)
.
.
       (Contributed by Dr. V. Chowdary Jampala)

Highlights

Please refer to the 3 parts of the video on the left side: Sirivennela gaari keynote speech @ TANA 2009 is centered on the same concept of this Inaugural dance ballet and provides the key insights behind the Ballet.
……………………………………………………………………………………………….

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)